ప్లేఆఫ్స్‌కు ఆర్‌సీబీ.. సింహాల కంటే బిగ్గ‌ర‌గా గ‌ర్జించారంటూ విజ‌య్ మాల్యా ప్ర‌శంస‌లు

  • ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ
  • ‘మా పెద్ద సింహాలు’ అంటూ ఆర్సీబీని కొనియాడిన మాజీ ఓనర్ మాల్యా
  • పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో బెంగళూరు
  • వరుసగా ఆరో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. నిన్న‌ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి, ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ విజయంపై ఆర్సీబీ మాజీ యజమాని విజయ్ మాల్యా స్పందిస్తూ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ విజయంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాల్యా స్పందించారు. ఆర్సీబీని 'నమ్మ దొడ్డ సింహగళు' (మన పెద్ద సింహాలు) అని అభివర్ణించారు. అంద‌రికంటే ముందు ప్లేఆఫ్స్ కు చేరి మ‌న‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేశారంటూ కితాబునిచ్చారు. బోల్డ్‌గా ఆడి సింహాల కంటే బిగ్గ‌ర‌గా గ‌ర్జించారని, కంగ్రాట్స్ చెప్పారు. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ అత్యుత్తమ జట్టు అని ఆయన కొనియాడారు. ప్రస్తుతం 13 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మే 22న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌లో గెలిస్తే, టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది.

గతేడాది టైటిల్ విజేతగా నిలిచిన రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ, ఈసారి కూడా టైటిల్ గెలిచి తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) తర్వాత ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టిస్తుంది.

మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఈ జట్టు 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

Vijay Mallya
RCB
Royal Challengers Bangalore
IPL 2026
IPL playoffs
Punjab Kings
Rajat Patidar
Shreyas Iyer
Dharamshala
Cricket

More Telugu News